చాలీ చాలని జీతంతో బ్రతుకీడ్చే ఓ చిరుద్యోగి ఏదో పదికో పరక్కో కక్కుర్తిపడి దొరికిపోతే వెంటనే సస్పెండ్ చేసి, అరెస్ట్ చేసి - ఆ సస్పెన్షన్ కాలానికి అర్ధ జీతం మాత్రమే ఇచ్చి కన్న కష్టాలు పెడతారు. కానీ మన ఘనతవహించిన ప్రజాసేవకులకూ, వారి క్రిమినల్ సెక్రెట్రీలకూ మాత్రం జేబుల్లోవి వదలకుండా ప్రజల డబ్బుల్తోనే న్యాయ సహాయమందిస్తారట? ఎంత విచిత్రం?!
జగన్ ఆస్తుల కేసుకు సంబందించి ఆరుగురు మంత్రులకు నోటీసుల వ్యవహారంలో నలుగురు మంత్రులకు న్యాయ సహాయం అందించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, గీతారెడ్డిలకు మాత్రం న్యాయ సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరో మంత్రి పొన్నాల లక్ష్మయ్య పేరు కూడా ఈ జాబితాలో లేకపోవడం ఆసక్తికరంగా ఉంది. దీని ప్రకారం మంత్రులు పెట్టుకునే లాయర్లకు అయ్యే వ్యయాన్ని ప్రబుత్వం భరిస్తుందన్నమాట. అంటే దీని అర్దం వీరు జారీ చేసిన జీఓలలో తప్పు లేదనుకోవాలా? లేక వ్యక్తిగతంగా వీరు తప్పు చేయాలేదని భావించాలా అన్నది చర్చనీయాంశం అవుతుంది. ప్రభుత్వపరంగా వీటిపై సమాధానం ఇవ్వకపోగా మొదట్లో మంత్రులు వ్యక్తిగతంగా సమాధానం ఇవ్వాలని సూచించడం ఆ తర్వాత వారికి ఇప్పుడు పీజు ఇస్తామనడం ఒకడికొకడు సాయం చేసుకునే దొంగల రాజ్యాన్ని తలపిస్తోంది.
పోనీ వై.ఎస్ ఒక్కడే తప్పులు చేసాడు, మిగతా మంత్రులందరూ పరిశుద్ధులని ఈ ప్రభుత్వం భావిస్తోందనుకోవాలా అంటే అదీ లేదు. తనకు న్యాయసహాయం చేయాలని కోరిన మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణరావు విన్నపాన్ని పట్టించుకోనేలేదు.మోపిదేవి అరెస్టు అయినప్పుడు , ఆయన తప్పు చేయలేదని, ఆయనకు న్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అద్యక్షుడు బొత్స , చిరంజీవి వంటివారు వ్యాఖ్యానించారు.తీరా ఆయన కోరినా ప్రభుత్వం స్పందించలేదు.
నలుగురు మంత్రులకు మాత్రమే జిఓ ఇవ్వడం విశేషంగా ఉంది. పొన్నాల వ్రాసిన లేఖ తమకు అందలేదనీ, మరోసారి లేఖ పంపాలని ఆయన్ను కోరామనీ వివరణ ఇవ్వడాన్ని చూస్తే పాలన ఎంత అధమంగా ఉందో తెలుస్తోంది.ఇదే సమయంలో వీరితో పాటు ఎనిమిది మంది ఐ ఎ ఎస్ లకు ఇచ్చిన నోటీసుల విషయంలో వేరుగా జిఓ ఇస్తారా? వారికి సాయం చేయడానికి కూడ ప్రభుత్వం సిద్దపడుతుందా అన్నది చూడాల్సి ఉంటుంది.ఇదంతా చూస్తుంటే దొంగ చేతికి తాళాలు ఇచ్చేసిన సామెత గుర్తుకు రావడంలేదూ? మరి రేపట్నుండి ఏసీబీ కేసుల్లో ఇరుక్కునే ప్రతి చిన్నా పెద్దా ఉద్యోగులక్కూడా న్యాయ సహాయం చేసెయ్యండి....ఏం చక్కా జంకూ గొంకూ లేకుండా ప్రతొక్కడూ ప్రజల దగ్గర లంచాలు బరుక్కుంటూ (కావాలంటే మీ వాటాలు మీకు పంచుకుంటూ) రాష్ట్రాన్ని లంచాంధ్ర ప్రదేశ్ గా మారుస్తారు.
No comments:
Post a Comment